Fake Caste Certificate Scam: సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే లక్ష్యంగా ఈ దాందా కొనసాగుతుంది. ఒక్కో సర్టిఫికేట్ ని 10 వేల నుంచి 20 వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం. జిన్నారం మండల కేంద్రంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ల బాగోతం బయటపడింది. చిన్న పొరపాటుతో కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. సర్టిఫికెట్ లో తేదీ తప్పు వేసి, మాజీ తహశీల్దార్ డిజిటల్ సైన్ ఫోర్జరీ చేయడంతో నకిలీ సర్టిఫికెట్ దందా బయటకి వచ్చింది. స్థానిక మీ సేవా, ఆన్ లైన్ కేంద్రాల్లో ఈ స్కామ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సర్టిఫికెట్ లో వచ్చే నెల జులై 19 తేదీతో మాజీ ఎమ్మార్వో భిక్షపతి పేరుతో డిజిటల్ సైన్ ఉంది. అయితే, కుల ధ్రువీకరణ పత్రం కోసం మనోజ్ కుమార్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. తమ కుమారుడు గౌరీ శంకర్ కి మాదిగ కులం పేరుతో సర్టిఫికెట్ జారీ చేశారు. మనోజ్ కుమార్ అనే వ్యక్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రస్తుత తహశీల్దార్ దేవదాసు ఫిర్యాదు చేశారు.
Read Also: Visakhapatnam: గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట!
ఈ సందర్భంగా ఎన్టీవీతో జిన్నారం తహశీల్దార్ దేవదాసు మాట్లాడుతూ.. జిన్నారం మోడల్ స్కూల్ లో గౌరీ శంకర్ అనే విద్యార్థి అడ్మిషన్ గురించి సర్టిఫికెట్ వేరిఫికేషన్ కోసం మాకు ఈ సర్టిఫికెట్ వచ్చింది.. సర్టిఫికేట్ ను పరిశీలిస్తే వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఇంతకు ముందే రిజెక్ట్ చేసినట్టు మా రికార్డుల్లో ఉంది.. అలాగే, డేట్ కూడా తప్పుగా ఉండటంతో ఇది ఫేక్ సర్టిఫికెట్ అని నిర్దారించాం.. మాజీ ఎమ్మార్వో భిక్షపతి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇది తయారు చేశారు అని ఆరోపించారు. దీనిపై జిన్నారం పోలీస్ స్టేషన్ లో మనోజ్ కుమార్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశాం.. ఈ నకిలీ సర్టిఫికేట్ మీ సేవా కేంద్రాల నుంచి జారీ కాలేదు అన్నారు. నెట్ సెంటర్ లో దీనిని తయారు చేశారు.. ఐడీఏI బొల్లారంలో ఇతర రాష్ట్ర కార్మికులు ఎక్కువగా ఉంటారు.. కార్మికుల అవసరాల కోసం కొందరు దళారులు ఇలా చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చిందని ఎమ్మార్వో దేవదాసు వెల్లడించారు.