తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెల నుంచి పట్టణాల వరకు.. ఇప్పుడు విదేశాలకు సైతం బతుకమ్మ వేడుకలు విస్తరించాయి.. అయితే, బతుకమ్మ ఆడే విధానంలో మార్పు రావొచ్చు.. కానీ, ఈ ఫ్లవర్స్ ఫెస్టివల్ అంటే పల్లెలే గుర్తుకు వస్తాయి.. పల్లెల్లో దొరికే ప్రతీ పువ్వును తీసుకొచ్చి… భక్తితో బతుకమ్మలను పేర్చి.. ఊరంతా ఒక్కదగ్గర చేరి.. బతుకమ్మ విశిష్టతను చెప్పే పాటలు పాడుతూ.. లయబద్ధంగా ఆడుతూ.. ఆ తర్వాత గంగా దేవి ఒడికి చేర్చుతారు.. తొమ్మిది రోజుల పాటు వివిధ పేర్లతో పిలిస్తూ.. వివిధ రకాల నైవేధ్యాలు తయారు చేస్తుంటారు.. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభయ్యే ఈ వేడుకలు.. అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ.. సద్దుల బతుకమ్మతో ఉత్సవాలను ముగిస్తారు.. ఇవాళ తెలంగాణ లోగిళ్లలో సద్దుల బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు ప్రజలు సిద్ధం అయ్యారు.. ఇక, ప్రభుత్వం తగిన ఏర్పాట్లలో మునిగిపోయింది.
Read Also: BSNL 5G: గుడ్‌న్యూస్ చెప్పిన బీఎస్ఎన్‌ఎల్
సద్దుల బతుకమ్మ వేడుకలకు ఓరుగల్లులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. పండుగ సంబురాలతో ఇళ్లన్నీ పూలవనాలుగా మారాయి. దసరాకు రెండు రోజుల ముందే బతుకమ్మ వేడుకలు జరుగుతుండడంతో.. పండగకు పుట్టింటికి వచ్చే ఆడపడుచులతో మరింత సంతోషమైన వాతావరణంలో ఈ వేడుకలు జరగనున్నాయి.. ఇవాళ ఆఖరి రోజు సాయంత్రం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు తారాస్థాయికి చేరుకున్నాయి వేడుకలు.. ఇప్పటికే పూల సేవరణ పూర్తి చేశారు.. ఒక పొద్దున్నే పొలాల వెంట పువ్వులకు పరుగులు పెట్టేవారు కొందరైతే.. మార్కెట్లలో లభ్యమయ్యే పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలను పేర్చేవారు మరికొందరు.. పెద్ద బతుకమ్మలు తెచ్చి ఆలయాలు, చెరువులు, కుంటలు, కూడళ్ల వద్దకు చేరి ఆటలు ఆడి పాటలు పాడి భక్తిశ్రద్దలతో గౌరమ్మ తల్లికి పూజలు చేసి నైవేద్యాలను సమర్పించిన అనంతరం బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేయడంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి..
ఇక, సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటాపాటలతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్న ఆయన.. విజయాలను అందించే విజయదశమిని స్వాగతిస్తూ.. తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని తెలిపారు.. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు సీఎం కేసీఆర్.