హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని బాధించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్, పాలమూరు ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ప్రకటిస్తారేమోనని ఎదురుచూస్తే.. అవేమీ ఇవ్వకపోగా తన హోదాకు తగినట్లు మాట్లాడలేదని అన్నారు. ఒక విద్యాలయం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సమంజం కాదన్నారు. రాజకీయాలకు బదులు తెలంగాణ విద్యార్థుల కోసం నూతన విద్యాలయాలపై ఏదైనా ఒక ప్రకటన చేసి ఉంటే, తెలంగాణ సమాజం హర్షించేదన్నారు. ‘బేటి బచావో బేటి పడావో’ అనేది నినాదానికే పరిమితం చేసారన్నారు.
దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలు ఏర్పాటు చేసి, తెలంగాణకు అన్యాయం చేశారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. అనేక మంది పేద, మధ్య తరగతి అమ్మాయిలకు ఉన్నత విద్యను దూరం చేసిన ఘనత మోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సాంకేతికతో ముందుకెళ్తామని, అంద విశ్వాసాలను నమ్మబోమని చెప్పిన ప్రధాని.. నాడు కరోనా సమయంలో చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించడం ఏ సాంకేతిక కిందకి వస్తుందో చెప్పాలని నిలదీశారు. విభజన హామీలు మరిచి, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీలు రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, ఇవ్వకుండా చిల్లిగవ్వ సహాయం చేయని వారు.. నేడు తెలంగాణ గడ్డ మీద అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సబితా ఎద్దేవా చేశారు. 8 ఏళ్ళలో తెలంగాణాకు ఏం చేశారో, ఎన్ని నిధులు ఇచ్చారో చెప్తే బాగుండేదన్నారు. రాష్ట్రంపై అన్ని విషయాల్లో వివక్ష చూపుతూ, విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో మీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే వంద శాతం పని చేస్తున్నారని ఆరోపించారు. టూరిస్టుల మాదిరి కాకుండా, భాద్యతయుతమైన పదవిలో ఉన్న వారు విధానాలతో వచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తే బాగుంటుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో.. తెలంగాణ రాష్టం బీజేపీ పాలిత రాష్టాల కన్నా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సబితా అన్నారు. ఒక టెక్నాలజీ హబ్‌నే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శం అయ్యాయని.. మా అభివృద్ధిలో మీ వాటా – సహకారం గుండు సున్నా అని ఎద్దేశా చేశారు. పని చేస్తోందెవరో? మాటలతో పబ్బం గడుపుతుందెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.