వరంగల్ రైల్వే పోలీసుల అప్రమత్తతో ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వేగంగా వెళుతున్న ట్రైన్ నుంచి ప్లాట్ ఫాం పైకి పడిన యువకుడు కాసేపట్లో పట్టాలపై పడే ప్రమాదం నుంచి కాపాడిన వరంగల్ రైల్వే పోలీసుల్ని పలువురు అభినందిస్తున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లలో కదులుతున్న రైల్ నుండి దిగేందుకు ప్రయత్నించి అదుపు తప్పి పడిపోయాడు బీహార్ యువకుడు. అతడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు రైల్వే పోలీసులు.
బీహార్ కు చెందిన ప్రార్థన కుమార్ వరంగల్ నుండి బీహార్ కు వెళ్లేందుకు నవజీవన్ ఎక్స్ ప్రెస్ ఎక్కాలి. కానీ శాతవాహన ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ కదిలిన తర్వాత తను ఎక్కాల్సిన ట్రైన్ ఇది కాదని తెలుసుకున్న తర్వాత దిగడానికి ప్రయత్నించాడు. వేగంగా వెళుతున్న ట్రైన్ నుండి అమాంతం దూకేశాడు. ప్లాట్ ఫామ్ పైన అదుపు తప్పి పడిపోయాడు. ఆ వేగంతో పట్టాల క్రిందకు వెళుతున్న ఆ యువకుడిని అటువైపుగా వెళుతున్న ఇద్దరు రైల్వే పోలీసులు స్పందించి వెంటనే పక్కకు లాగడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.ప్రార్థన కుమార్ ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసులను పలువురు అభినందించారు.