RTC MD Sajjanar Talks About Financial Status Of TSRTC: టీఎస్ ఆర్టీసీ ప్రగతి రథంవైపు నడుస్తోందని.. ఈ ఏడాది చారిత్రాత్మకమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో తాను ఎండీ బాధ్యతల్ని స్వీకరించానని.. కొవిడ్, సమ్మె, డీజిల్ ధరలు లాంటి సమస్యల్ని ఎదుర్కొన్నామని అన్నారు. చార్జీల పెంపుతో పాటు మరికొన్ని చర్యలు తీసుకోవడం వల్ల.. ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. రోజుకు రూ. 13 కోట్ల ఆదాయం వస్తోందని పేర్కొన్న ఆయన.. రూ. 395 కోట్ల నష్టం మాత్రమే ఉందన్నారు. రూ. 641 కోట్ల నష్టాలను తగ్గించామని తెలిపారు. నష్టాలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయని, సుమారు 1500 కోట్ల నష్టాలు తగ్గించామని, ఆక్యుపెన్సీ 10 శాతం పెరిగిందని వివరించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని సజ్జనార్ చెప్పుకొచ్చారు.
ఇక టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. నిన్నటికి తాను పదవి చేపట్టి ఏడాది పూర్తయ్యిందన్నారు. తనకు చైర్మెన్ పదవి వచ్చినప్పుడు, ఎందుకు తీసుకున్నామని చాలామంది ప్రశ్నించారని.. అయితే తనకు ఛాలెంజింగ్ ఇష్యూస్ ఇష్టం కావడం వల్ల ఈ బాధ్యతల్ని స్వీకరించానని అన్నారు. గతేడాదిలో హైదరాబాద్ ఆదాయం రూ. 306 కోట్లు అయితే.. ఈ ఏడాదిలో రూ. 603 కోట్లకు పెరిగిందన్నారు. ఆయా జిల్లాల పరిధిలో ఆదాయం గణనీయంగా పెరగడం వల్లే.. వచ్చే ఆదాయం రెట్టింపయ్యిందన్నారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల సెస్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని.. దానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని తాము భావించామని, కానీ ప్రజలు దాన్ని స్వీకరించారని పేర్కొన్నారు.
గతంలో ఆర్టీసీలో అనేక సమస్యలు ఉండేవని, తాము ఆర్టీసీతో పాటు సిబ్బందిని సైతం కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. లాభాల బాట పట్టకపోయినా.. నష్టాల్ని పూడ్చుతూ తాము సఫలీకృతమవుతున్నామన్నారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయమని హామీ ఇచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్.. కొత్త బస్సుల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం 60 శాతం ప్రభుత్వ బస్సులతో పాటు కొన్ని అద్దె బస్సులున్నాయన్నారు.