రాష్ట్రంలో సుదీర్ఘంగా భూ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ధరణి వచ్చిన తర్వాత సమస్యలు మరింత పెరిగిపోయాయనే.. కొత్త సమస్యలు వస్తున్నాయని.. అవి పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.. అయితే, పెండింగ్‌లో ఉన్న భూరికార్డులు, భూసమస్యల పరిష్కారంపై మరోసారి దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం.. వాటి పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కె. చంద్రశేఖర్ రావు.. భూరికార్డుల సమస్యల పరిష్కారం, రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఇవాళ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. భూసమస్యల పరిస్థితి, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి.. కీలక సూచనలు చేశారు..
Read Also: Amara Raja: ఫోర్బ్స్ 500 బెస్ట్ ఎంప్లాయర్స్ జాబితాలో గల్లా కంపెనీ
భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్… మండలం కేంద్రంగా 3 రోజులకు ఒక మండలం చొప్పున వంద బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు.. ఇక, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని స్పష్టం చేశారు. అయితే, రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించిన అవగాహన కోసం ఈ నెల 11వ తేదీన ప్రగతిభవన్‌లో సదస్సు నిర్వహించనున్నారు.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ అవగాహన సదస్సుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరుకానున్నారు. భూ సమస్యల కోసం ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టరేట్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఈ రెవెన్యూ సదస్సులు ఎంతో ఉపయోగపడనున్నాయని చెబుతున్నారు.
