ఈ నెల 6 ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు సంఘర్షణ సభను నిర్వహించారు. అయితే రైతు సంఘర్షణ సభ స్థలాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో టీపీసీస రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆనాడు రజాకార్లు, ఇప్పుడు కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల రక్తంలో పోరాడే గుణం ఉందని, భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడింది వరంగల్ గడ్డ అని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం సభ నిర్వహించట్లేదని, రాహుల్ గాంధీ సూచన మేరకు వరంగల్ గడ్డపై సభ నిర్వహిస్తున్నామన్నారు.
విప్లవాలకు పునాది వేసింది ఓరుగల్లు అని, రుణమాఫీ కోసం 15వేల కోట్లు కేటాయించలేదన్నారు. బ్యాంకు రుణాల మిత్తి పెరిగి, మనస్తాపంతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, వరంగల్ లో 22 మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించలేదని ఆయన మండిపడ్డారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంవల్ల రైతులు నష్టపోతున్నారని, బెల్ట్ షాపులు తెచ్చి, తాగుబోతుల తెలంగాణ చేస్తున్నాడు సీఎ కేసీఆర్ అంటూ ఆయన ధ్వజమెత్తారు. గతంలో 6 పబ్బులు ఉంటే, కేసీఆర్ 89 పబ్బులకు అనుమతులు ఇచ్చాడని, గంజాయి పండించేవిదంగా రైతులను పురిగొల్పుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆయన విమర్శించారు.