Site icon NTV Telugu

CM Revanth Reddy : 2029లో సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను.. మంత్రిని చేస్తాం

Siddipet

Siddipet

సిద్దిపేట గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న సిద్దిపేట రాజకీయాల్లో మార్పు రావాలని పిలుపునిచ్చిన ఆయన, రాబోయే 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని భారీ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ ఎమ్మెల్యేను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే బాధ్యతను తాను, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించారు.

రాజకీయంగా హరీష్ రావు, కేటీఆర్ లేదా కేసీఆర్‌తో తనకు ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఆయా నియోజకవర్గాల్లోని పేదలకు అన్యాయం జరగనివ్వనని సీఎం స్పష్టం చేశారు. “అక్కడ కూడా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. రాజకీయాల కోసం వారిని ఇబ్బంది పెట్టను” అని చెబుతూ, సిద్దిపేట, గజ్వేల్ , సిరిసిల్ల నియోజకవర్గాలకు ఒక్కో దానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను (మొత్తం 10,500 ఇళ్లు) మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వ నిష్పక్షపాత వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

Stock Market: బాబోయ్.. భారతీయ మార్కెట్లో పెట్టుబడులు వద్దే వద్దు.. షేర్లు అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు..

సిద్దిపేటలో నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను అనుకుంటే ఈ పరిశ్రమను తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు తరలించవచ్చని, కానీ ఇక్కడి రైతుల అవసరాలను గుర్తించి సిద్దిపేటలోనే కొనసాగించామని చెప్పారు. “నేను ఎమ్మెల్యేల కోసం పని చేయను.. ప్రజల కోసం పని చేస్తాను” అని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో కొడంగల్‌కు ఎన్ని నిధులు ఇచ్చారో, ఈ 24 నెలల్లో తాను ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు ఇచ్చానో లెక్క తీయడానికి సిద్ధమని సవాలు విసిరారు.

గత ప్రభుత్వం మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల సమయంలో రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూసేకరణ చేసిందని సీఎం విమర్శించారు. దానికి భిన్నంగా, తన నియోజకవర్గంలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం 98.5 శాతం రైతులను ఒప్పించి, వారికి రావాల్సిన నష్టపరిహారాన్ని పెంచి మరీ భూసేకరణ చేశామని వివరించారు. రైతు కన్నీరు పెట్టని సాగునీటి ప్రాజెక్టులే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

1984 నుండి ఒకే కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో కొత్త వారికి అవకాశం ఇచ్చి చూడాలని సిద్దిపేట ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. “ఒక్కసారి మార్పు చేసి చూడండి.. మంచి జరుగుతుందో లేదో మీకే తెలుస్తుంది” అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. చైతన్యవంతులైన సిద్దిపేట ప్రజలు విచక్షణతో ఆలోచించి 2029లో కాంగ్రెస్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

Vaibhav Suryavanshi: రెండు నుంచి మూడు వేల పరుగులు.. ప్లాన్ చెప్పిన వైభవ్.. పగలబడి నవ్విన తోటి ఆటగాళ్లు

Exit mobile version