ఇటీవల అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అస్సాం సీఎం మాటలు దేశంలో ఉన్న తల్లులను అవమానించేలా మాట్లాడారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన విమర్శించారు. విమర్శలలో.. బాషా పదునుగా ఉండాలి కానీ..జుగుస్తకరంగ ఉండొద్దని ఆయన అన్నారు.
బీజేపీ కనీసం ఖండించలేదని, ఖండించాలని ఇంగిత జ్ఞానం కూడా లేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయాలకు వారసులం అని చెప్పుకునే బీజేపీ.. అస్సాం సీఎంనీ బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 709 పోలీస్ స్టేషన్‌లలో అస్సాం సీఎం పై ఫిర్యాదులు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. రేపు 11 గంటలకు ఫిర్యాదు తెలంగాణలోని పోలీస్ స్టేషన్‌లలో అస్సం సీఎంపై కేసులు పెడతామని ఆయన అన్నారు. తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.