CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్‌కు సవాల్.!

  • సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
  • బీఆర్‌ఎస్, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • రైతు భరోసా, రుణమాఫీపై ప్రభుత్వ ఘనతను వివరించిన సీఎం
  • ఇందిరమ్మ ఇళ్లపై ప్రతిపక్షాలకు రేవంత్ సవాల్
Cm Revanth Kcr

Cm Revanth Kcr

CM Revanth Reddy : సంగారెడ్డి వేదికగా జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. నాయకుడు జగ్గారెడ్డి పర్యవేక్షణలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేలాదిమంది మహిళల సమక్షంలో ఈ సభ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డు అనేది కేవలం ఒక ప్లాస్టిక్ కార్డు లేదా ఉచితంగా బియ్యం పొందే సాధనం మాత్రమే కాదని, పేదరికాన్ని నిర్మూలించే దిశగా వేసిన బలమైన అడుగని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నాడు రేషన్ వ్యవస్థను తీసుకొచ్చిందని, గతంలో ఇందిరాగాంధీని మెదక్ ఎంపీగా గెలిపించడం వల్లే ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఇందిరమ్మ ఆశయాలను ఆదర్శంగా తీసుకునే తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

‘బీఆర్ఎస్, బీజేపీ ఒకే నాణేనికి రెండు ముఖాలు’

రాష్ట్రంలో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏనాడైనా పేద ప్రజల ఆకలి తీర్చాలని ఆ పార్టీలు ఆలోచించలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో దాదాపు 3 కోట్ల 48 లక్షల మంది ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బియ్యం దొడ్డుగా ఉండి, మనుషులు తినలేక బర్లకు దాణాగా వేసే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు తాము ఇస్తున్న సన్న బియ్యం ప్రతి పేద కుటుంబానికి కడుపు నింపుతోందని వివరించారు.

ఉచిత కరెంట్, రూ. 2 లక్షల రుణమాఫీతో రైతులకు అండ

వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ గత పాలకుల తీరును సీఎం ఎండగట్టారు. ‘వరి వేస్తే ఉరి’ అని గతంలో రైతులకు ఉచిత సలహాలు ఇచ్చిన వ్యక్తి, సిద్దిపేట జిల్లాలోని తన సొంత ఫామ్‌హౌస్‌లో మాత్రం వరి పండించి కంపెనీలకు అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా, ఆ బియ్యాన్నే పేదలకు పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ రైతుబంధును బంద్ చేయకుండా, దానికి మరో రెండు వేలు పెంచి ‘రైతు భరోసా’ రూపంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని స్పష్టం చేశారు. ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి, దేశంలోనే అప్పులు లేని రైతును తెలంగాణ ప్రభుత్వం అందించిందని కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని, మరి ఈ విషయం బీజేపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

సంక్షేమంలో మార్పు.. పాలపిట్ట చీరల నుంచి ఇందిరమ్మ ఇండ్ల వరకు

మహిళా సంక్షేమంపై మాట్లాడిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు కనీసం నాణ్యత లేక పొలాల వద్ద అడవి పందులను బెదిరించడానికి మాత్రమే పనిచేశాయని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరల కొనుగోళ్లలో కమిషన్లు తీసుకున్న వారు ఈ రోజు తమ ప్రభుత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకం ద్వారా అక్కచెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, అలాగే 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఆడబిడ్డల పేరుతోనే మంజూరు చేశామని తెలిపారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ‘ఆహా నా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావు తరహాలో ప్రజలను ఊరించి మోసం చేసిందని, కానీ తమ నాయకులు మాత్రం 10 ఎకరాల్లో సొంత ఫామ్‌హౌస్‌లు, గడులు కట్టుకున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిన ఊళ్లలోకి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఓట్లు అడిగితే వారికి డిపాజిట్ కూడా రాదని, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ప్రతి ఊరిలోనూ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఓట్లు అడుగుతుందని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.