CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్

  • రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల
  • 44.28 లక్షల రైతులకు రూ.2,482 కోట్లు జమ
  • వ్యవసాయాన్ని పండుగగా మారుస్తామన్న సీఎం
  • బీఆర్ఎస్ అప్పులపై రేవంత్ తీవ్ర విమర్శలు
Rythu

Rythu

తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళావేదిక వేదికగా అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసిందని సీఎం వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమ 30 నెలల ప్రజాపాలనలో అన్నదాతలు ఎల్లప్పుడూ తలెత్తుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని, వ్యవసాయం దండగ కాదని, దానిని ఒక పండుగగా భావించేలా రాష్ట్రంలో అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే ఉండగా, 2023 నాటికి అది ఏకంగా రూ.8.11 లక్షల కోట్లకు చేరిందని ఆయన గుర్తుచేశారు. గత పదేళ్ల పాలనలో దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి, ఒకప్పటి ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అప్పులు, తప్పుల భారాన్ని ఇప్పుడు తమ ప్రభుత్వం భరించాల్సి వస్తోందని, తవ్వుతున్న కొద్దీ ఇంకా కొత్త అప్పులు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు. “బకాయిలు పెట్టింది బకాసురుడు… కట్టే పాపం మాకా?” అంటూ గత ప్రభుత్వంపై ఆయన పదునైన విమర్శలు సంధించారు.