రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలన, భద్రతా కమిటీల పనితీరుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధంపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని స్పష్టం చేసిన సీఎం, వీటి విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్యాసంస్థలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలకే పూర్తి బాధ్యతలను అప్పగించాలని స్పష్టం చేశారు.
విద్యాసంస్థల్లో నిఘా.. యాజమాన్యాలకే పూర్తి బాధ్యత
క్యాంపస్ లోపల డ్రగ్స్‌కు సంబంధించి ఏ చిన్న ఘటన చోటుచేసుకున్నా సదరు విద్యాసంస్థ యాజమాన్యాన్నే పూర్తి బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యాసంస్థలకు అధికారాలతో పాటు స్పష్టమైన బాధ్యతలను కూడా అప్పగించాలని ఆదేశించారు. క్యాంపస్ వెలుపల జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించేందుకు అనువైన వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ప్రతి విద్యాసంస్థలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు.
క్యూఆర్ కోడ్, టోల్ ఫ్రీ నెంబర్లు.. త్రీ-స్టెప్ యాక్షన్ ప్లాన్
డ్రగ్స్ సమాచారాన్ని గోప్యంగా అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్లు, ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌లను అందుబాటులో ఉంచే అంశాన్ని పరిశీలించాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం అనే మూడు దశలను సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. మొదటిసారి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారిని వెంటనే డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించి కౌన్సెలింగ్ ఇవ్వాలని, అయితే పదే పదే పట్టుబడితే మాత్రం ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిపై కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే నూతన చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

