వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేట లో అభివృద్ధి శూన్యంమని…. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా… ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. తుంకి మెట్ల లో కూడా టీఆర్ఎస్ ను తరిమి కొట్టేందుకు తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ , కేటీఆర్ లను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరమాలని.. ఈ ప్రాంతానికి రైలు మార్గము కేసీఆర్ రాకుండా చేశారని ఆరోపించారు. కొడంగల్ కు కృష్ణా జలాల కోసం నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల కు 69 జీవో తెచ్చానని..కొడంగల్ అభివృద్ధి అనేది తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2011 లోనే కొడంగల్ కు తాగునీటి శాశ్వత పరిష్కారం చూపానని వెల్లడించారు. ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న …కేటీఆర్ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా…? అంటూ సవాల్ విసిరారు.
తెలంగాణ ఇచ్చినాక పేదలకు మేలు జరగలేదని.. తెలంగాణ లో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే అని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారని… అందుకే రైతు డిక్లరేషన్ చేసామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2500 రూపాయలు క్వింటాలు కొంటామని.. పండించిన చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చారు. రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ క్యాడర్ గ్రామ గ్రామాన తెలియపరచాలి.. బ్యాంక్ రుణాలు బాకీ ఉన్న వారు ఒక్క రూపాయి చెల్లించకండని అన్నారు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది… 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని, రైతులు అప్పులున్నవారు ఆత్మహత్యలు చేసుకోకండి భరోసా ఇచ్చారు.