CM Revanth Reddy : కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సూటి సవాల్ విసిరారు. ఎవరి పనితీరు మెరుగో గణాంకాలతో తేల్చుకుందామని సవాల్ చేస్తూ, బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారని తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి వినియోగంలో స్పష్టమైన మార్పు చూపించామని, గత ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో ప్రజల ముందు పెడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
నీటి వాటా, వినియోగంపై లెక్కలు ఇవే
కృష్ణా జలాల వాడకంపై గణాంకాలను ప్రస్తావిస్తూ, 2023–24లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 119 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో 285 టీఎంసీలు, రెండో ఏడాది 268 టీఎంసీల నీటిని వాడుకున్నామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏపీ 132 టీఎంసీలు తీసుకుంటే, తెలంగాణ 110 టీఎంసీలు వినియోగించుకుందని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాగా 45.44 శాతం వాడుకున్నామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో 34 శాతానికే హక్కులను పరిమితం చేశారని, మరి బాగా పనిచేశారా, మేం బాగా పనిచేశామా అని హరీష్ రావును సూటిగా ప్రశ్నించారు.
ప్రాజెక్టుల నిర్లక్ష్యం.. రూ.1.80 లక్షల కోట్ల చెల్లింపులు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పదేళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు రూ.1.80 లక్షల కోట్లు చెల్లించారని, రూ.2.20 లక్షల కోట్ల బిల్లులు నమోదైనా ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని విమర్శించారు.
ఏపీ ప్రాజెక్టులు పూర్తి.. తెలంగాణకు అన్యాయం
కేసీఆర్ అధికారంలోకి రాకముందు రోజుకు 4.47 టీఎంసీల నీటి తరలింపు సామర్థ్యం ఉండగా, తర్వాత అది రోజుకు 13.17 టీఎంసీలకు పెరిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ నుంచి భారీగా నీటిని తరలించేలా ఏపీ ప్రాజెక్టులు నిర్మించుకుందని, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హంద్రీనీవాతో పాటు తెలుగు గంగ, వెలిగొండ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుందని అన్నారు. ఏపీ ప్రాజెక్టులు పూర్తయినా తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం పెండింగ్‌లోనే ఉన్నాయని, తెలంగాణ ప్రజల హక్కులను సమాధి చేసి ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తారా అంటూ సీఎం మండిపడ్డారు.

