తెలంగాణ అభివృద్ధి, విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా తాను తలపెట్టిన విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్‌లో భాగస్వామ్యమవుతూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటే, కేంద్రం రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
విదేశీ పర్యటన ఉద్దేశం.. విద్య, పెట్టుబడులే మా లక్ష్యం
రాష్ట్రాల కలయికతోనే కేంద్రం ఏర్పడుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రైజింగ్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో విద్య, క్రీడలు, పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. గాంధీ, అంబేడ్కర్ లాంటి మహానీయులు చదువుకున్న ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావాలని భావించామని, ఇక్కడే ఆ స్థాయి క్యాంపస్‌లు వస్తే వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని వివరించారు.
లండన్‌కు ఓకే.. అమెరికాకు నో ఎందుకు?
తన విదేశీ పర్యటనకు సంబంధించి కేంద్రానికి సమర్పించిన దరఖాస్తులో అన్ని వివరాలు పక్కాగా పొందుపరిచామని, పర్యటన ఉద్దేశాన్ని (పర్పస్) స్పష్టంగా వివరించామని సీఎం తెలిపారు. దరఖాస్తులో అసంపూర్ణ వివరాలు ఉన్నాయంటూ బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. లండన్, అమెరికా పర్యటనలకు ఒకే రకమైన ప్రతిపాదనలు సమర్పిస్తే.. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చి, అమెరికా పర్యటనను ఎందుకు తిరస్కరించారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పర్యటనలో విషయంలో లేకపోతే ఇంగ్లాండ్‌కు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
పర్యటనపై బీజేపీ రాజకీయాలు.. మోడీ గుజరాత్‌కే ప్రధానా?
కేంద్రం తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం తెలంగాణ ముఖ్యమంత్రిని తిరస్కరించడం కాదని, ఇది తెలంగాణ ప్రజలను తీవ్రంగా అవమానించడమేనని రేవంత్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా కాకుండా కేవలం ‘గుజరాతీ’గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రి వైబ్రెంట్ గుజరాత్ రోడ్ షోల కోసం అమెరికా, కెనడాల్లో పర్యటించేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం, తెలంగాణ అభివృద్ధి కోసం తాను వెళ్తానంటే ఎందుకు అడ్డుకుందో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా దేశంలోని అనేకమంది నాయకులు, కోట్లాది మంది ప్రజలు తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. పరిపాలనాపరమైన ఈ అంశంపై విచక్షణ కోల్పోయి అవాస్తవాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, వారికి ఆ స్థాయి కూడా లేదని తేల్చిచెప్పారు.

