తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భిన్న ధృవాలుగా వున్నారనే ప్రచారం వుంది. తాజాగా వీళ్ళిద్దరూ ఐక్యతారాగం వినిపించారు. కలిసి కనిపించారు. తెలంగాణలో పీసీసీ పీఠం కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. ఒకరికి పదవి దక్కగానే.. మరొకరు ఒంటికాలిపై లేచారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సమన్వయం లేదు. కానీ అప్పుడప్పుడు కలిసి కనిపిస్తారు. మనసులు కలిశాయా.. మనుషులు కలిశారా అని అనుకుంటున్న తరుణంలోనే చర్చల్లోకి వస్తారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ పడుతున్న రేవంత్-కోమటిరెడ్డి ఎవరికీ అంతుచిక్కరు.
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్దరూ ఇద్దరే. తేడా వచ్చిందంటే మాటల తూటాలు ఓ రేంజ్‌లో పేలుతాయి. రైతుల సమస్యలపై ఇందిరాపార్క్‌లో జరిగిన రెండు రోజుల దీక్షలో రేవంత్.. కోమటిరెడ్డికి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకే వేదికపై కనిపించారు. ఆ దృశ్యం పార్టీ కేడర్‌కు పాజిటివ్ సంకేతాలు పంపిందంటారు. తర్వాత ఎవరిదారి వారిదే అన్నట్టుగా మారింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల ప్రారంభం తర్వాత.. కూడా కలిసి ఒకే ఫ్రేమ్‌లో పక్క పక్కన నిలబడి ప్రెస్‌మీట్ పెట్టారు. ఇద్దరూ సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తుంటారు. అయితే ఈమధ్యే కేసీఆర్ ని కలిసి వచ్చారు కోమటిరెడ్డి. ఈ వ్యవహారం పార్టీలో చర్చకు దారితీసింది.
Happy times…. pic.twitter.com/kWBspwDdBA
— Revanth Reddy (@revanth_anumula) February 15, 2022
పీసీసీ చీఫ్ పీఠం ఆశించినా రాకపోవడంతో కోమటిరెడ్డి అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఆ పదవి రాకపోయినా.. కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్‌లో రేవంత్‌తో ఎడముఖం పెడముఖంగా ఉంటారనే ప్రచారం వుంది. అయితే ఈ ప్రచారానికి కాస్త ఫుల్ స్టాప్ పెట్టారు రేవంత్. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను ట్వీట్ చేస్తూ హ్యాపీ టైమ్స్ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు. ఇద్దరి దోస్తీ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.