Renuka Chowdary Satires On TRS Party: పాలేరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏయ్ కందాల ఉపేందర్ రెడ్డి.. కళ్ళున్న వాడివైతే కాంగ్రెస్‌ని చూడు.. నీ పదవి కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిన బిక్ష’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘పాలేరు అడ్డ కాంగ్రెస్ అడ్డ.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా’ అని చెప్పారు. పాలేరులో కారు (టీఆర్ఎస్ పార్టీ గుర్తు) టైర్లకు పంచర్లు పడ్డాయని ఎద్దేవా చేశారు. నీ లిక్కర్ బిజినెస్ మత్తు నీ తలకెక్కిందా? దొడ్డి దారిన కారెక్కి, టీఆరెస్‌లో కులుకుతున్నావా? అంటూ నిలదీశారు. జిల్లాలో గుట్టలు లేవని.. ఎక్కడపడితే అక్కడ గుంటలు తవ్వేశారని అన్నారు. నాలుగేళ్ళుగా లేని పించన్లు, ఇవాళ గుర్తుకు వచ్చాయా? అంటూ ప్రశ్నించారు. పనికి రాని చీరలిచ్చి, ప్రజలను మభ్యపెట్టే మోసపు ఆలోచనలు ఎందుకు? అని తూర్పారపట్టారు. ‘ఆ చీరల్ని నీ కుటుంబాన్నే కట్టుకోమను’ అంటూ మండిపడ్డారు.
కాగా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా గర్జన కార్యక్రమాన్ని పాలేరులో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రేణుకా చౌదరిని జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నాయకన్ గూడెం నుంచి పాలేరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రేణుకా చౌదరి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. అనంతరం బీవీ రెడ్డి ఫంక్షన్‌హాల్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ఆమె.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు.