Shankarpally Robbery: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని కొత్తపల్లి గ్రామం దగ్గర పట్ట పగలే దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తున్న స్టీల్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు ఏకంగా 40 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జనతా స్టీల్ షాప్ నుంచి రూ.40 లక్షల నగదు తీసుకుని వస్తున్న వ్యాపారుల కారు కదలికలను ముందుగానే గమనించిన నలుగురు దుండగులు మరో కారులో ఫాలో అయ్యారు.
Read Also: 1973 Plane Hijacking: నేపాల్ ప్రధాని రేసులో సుశీలా కర్కీ.. ఈమె భర్త విమానం హైజాక్ చేశాడని తెలుసా..?
అయితే, శంకర్‌పల్లి సమీపంలోని కొత్తపల్లి గ్రామం సమీపంలో అదును చూసుకున్న దుండగులు ఒక్కసారిగా స్టీల్ వ్యాపారి కారును ఢీకొట్టి, కారు అద్దాలు ధ్వంసం చేసి కత్తులు, బొమ్మ తుపాకీతో బెదిరించారు. ఇక, కారులో ఉన్న నగదు బ్యాగును బలవంతంగా లాక్కుని తమ వాహనంలో పారిపోతున్న క్రమంలో దుండగుల వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సందర్భంగా రూ.8 లక్షల నగదు బ్యాగును అక్కడే వదిలి పెట్టి, మిగతా డబ్బుతో దుండగులు జంప్ అయ్యారు. ముందుగానే మరో కారును బ్యాకప్‌గా ఉంచుకున్న వారు కొంతదూరం పరిగెత్తి ఆ వాహనంలో ఎక్కి అక్కడి నుంచి పరార్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పారిపోయిన దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.