TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’

  • రాహుల్ అరెస్ట్‌ను ఖండించిన టీపీసీసీ
  • రేపు భారీ నిరసన ర్యాలీ
  • నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు మార్చ్
  • కాంగ్రెస్ శ్రేణులకు మహేష్ గౌడ్ పిలుపు
Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ చర్యలు నిరంకుశత్వానికి, నియంతృత్వ ధోరణికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ఈ అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ రేపు ఉదయం ‘ఛలో రాజ్ భవన్’ (లోక్ భవన్) కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

NEET పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరపాలని, అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని మోడీ ఇంటి ముందు ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపట్టారని మహేష్ గౌడ్ గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, విచారణకు భయపడి భాజపా సర్కార్ తోక ముడిచి అరెస్టులకు పాల్పడిందని విమర్శించారు.

ఈ క్రమంలోనే భాజపా నిరంకుశ పాలనపై పెద్ద ఎత్తున సమరం చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ (లోక్ భవన్) వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి భాజపా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.