సీఎం కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు చాలా విరుద్ధమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ సీఎం అయ్యాడని, దళితుల, బీసీల, మైనారిటీల సంక్షేమం కోసం మార్చాలి అంటున్నారని, కానీ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 9 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, సీఎం చేసిన వ్యాఖ్యలు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ఏప్రిల్ 9న నిరసనకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను విజ్ఞప్తి చేశామని, అనుమతి ఇచ్చినా ఇవ్వక పోయినా ర్యాలీ చేస్తామన్నారు. ప్రభుత్వ తప్పిదాలు గుర్తు చేసేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. రాజ్యాంగం మీద కేసీఆర్ వ్యాఖ్యలు అహంకార పూరితమన్నారు. సీఎం తన వ్యాఖ్యలు ఉపసహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఇందిరాపార్క్ వద్ద యుద్ధభేరి శాంతియుతంగా చేస్తామన్నారు. కేసీఆర్ సర్కార్ నిరాకరణ చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ సర్కార్ హరించి వేస్తోందని, సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కులను హరిస్తుందన్నారు. గవర్నర్ ను సైతం కేసీఆర్ లెక్క చేయక పోవడం అహంకార పూరితమన్నారు. కేసీఆర్ తన అవసరాల కోసం ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేస్తారన్నారు.