ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రాణహిత నది పరీవాహకం వెంట పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా హాజరవుతున్నారు. గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలయ్యాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 3గంటల 54 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభం అయ్యాయి.
కొమురంభీం జిల్లా కౌటాల, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచలో ఒకే ముహూర్తంలో పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కరాలకు ఏర్పాట్ల చేశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 40 కోట్లతో ప్రతిపాదనలు పంపినా నిధుల కేటాయింపు జరగలేదు. 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ 44 బస్సులను నడపనుంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లు అర్జునగుట్ట దగ్గర పుష్కరాల్లో పాల్గొన్నారు.
ఇక కాళేశ్వరంలోనూ ఏర్పాట్లను పట్టించుకోలేదు అధికారులు. కలెక్టర్ ఫండ్ నుంచి 49 లక్షలు మాత్రమే మంజూరు చేశారు. కాళేశ్వరంలో సాధారణ ఘాట్ దగ్గర మూడు షవర్లు ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకోవడానికి రెండు షెడ్లు నిర్మించారు. మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రాణహిత పుష్కరాలకు కాళేశ్వరం దేవస్థానం ముస్తాబైంది. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. పుణ్యస్నానాలు చేసిన భక్తులు కాళేశ్వర-ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
Also Read: KTR: దళితబంధుని కూడా కాపీ కొడతారేమో!
మొదటి రోజు కోసం 10 క్వింటాళ్ల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. కాళేశ్వరంలో 5 మెడికల్ క్యాంపులు పెట్టారు. పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. పుష్కరాలకు కాళేశ్వరం నుంచి మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచ వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను ఉచితంగా తీసుకువెళ్లెందుకు ఏర్పాట్లు చేశారు. ప్రాణహిత పుష్కరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తగినన్ని నిధులు కేటాయించకపోవడం వల్ల సౌకర్యాలు అందక భక్తులు ఇబ్బందులు పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
