హైదరాబాద్ లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సైబర్ దాడిలో మహేష్ బ్యాంకు నుంచి నిందితులు రూ. 12 కోట్లు మాయం చేశారు. ఈ 12 కోట్లను సైబర్ 120 అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు, మహేష్ బ్యాంకు మెయిన్ సర్వర్ పై ఈ దాడి జరిగినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షాజహాన్ అనే మహిళ శాన్విక్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో సిద్ధంబర్ బజార్‌లో 11న బ్యాంక్ అకౌంట్ తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన షాజహాన్ అకౌంట్ ద్వారా రూ.6.9 కోట్లు నేరగాళ్లు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే నిధులు గోల్‌మాల్ అయినరోజునే షాజహాన్‌కు బ్యాంక్ సిబ్బంది కాల్ చేయడంతో.. షాజహాన్ పరారైనట్లు సమాచారం. మహేష్ బ్యాంక్ ప్రధాన సర్వర్ నుంచి షాజహాన్ అకౌంట్‌కి నిధులు బదిలీ అయ్యాయని, షాజహాన్‌కు సంబంధించిన ఫోన్, ఐడీలు, మెయిల్ అడ్రస్‌లను హాకర్స్ మార్చలేదని, షాజహాన్‌కు హాకర్స్‌తో సంబంధాలున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సర్వర్‌పై రష్యా, చైనా నుంచి ఆపరేట్ చేసినట్లు, ఇండియాలో హాకర్స్‌కి నైజీరియన్లు సపోర్ట్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షాజహాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.