Police Found One Crore In Tata Safari Car And Seized: ఎన్నికల సమయంలో డబ్బులు ఎలా పంపిణీ చేయబడతాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రాజకీయ పార్టీలన్నీ ధారాళంగా డబ్బులను పంపిణీ చేస్తారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు తాజాగా వెలుగులోచూసిన సంఘటనే నిదర్శనం. మునుగోడు మండలం చెల్మేడ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా.. టాటా సఫారీ TS 02 FH 2425 వాహనంలో రూ. 1 కోటి నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఇది కరీంనగర్ జిల్లాకు చెందిన 13 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ జయశ్రీ భర్త సోప్పరి వేణు వాహనంగా పోలీసులు గుర్తించారు. దీంతో.. ఆయన్ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.
బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వివేక వెంకట స్వామి ఆదేశాల మేరకు.. విజయవాడకు చెందిన రాము వద్ద నుంచి ఈ కోటి రూపాయల నగదును తీసుకొస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ నోడల్ అధికారులకు సమాచారం అందించారు. మునుగోడులో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో.. ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రూ. 1 కోటి నగదు ఉన్న వాహనం పట్టుబడటం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఈ డబ్బు ఎన్నికల కోసం తీసుకొస్తున్నారా? లేక మరే ఇతర పనుల కోసం ఏమైనా తరలిస్తున్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.