NTV Telugu Site icon

Dog Missing: తప్పిపోయిన పూజారి శునకం.. సీసీ కెమెరాలు శోధించి పట్టుకున్న పోలీసులు

Dog Missing

Dog Missing

పెంపుడు జంతువులు తప్పిపోతే అల్లాడిపోతారు.. మొదట వాటి జాడ కోసం వెతకడం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించడం.. అయిన తర్వాత కొందరు దాని గురించి మర్చిపోతే.. మరికొందరు మాత్రం తమ పెంపుడు జంతువులతో ఉన్న అనుబంధాన్ని మరవలేకపోతారు.. చివరకు పోలీసులను ఆశ్రయించిన సందర్భాలు కూడా అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా హైదరాబాద్‌లో తన పెంపుడు కుక్క పోయిందంటూ ఓ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, శునకం కోసం రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలను వెతకడం ప్రారంభించారు.. ఫిర్యాదు దారుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల నుంచి క్రమంగా అది ఎటువైపు వెళ్లిందో.. ఆ రూట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శోధించి చివరకు ఆ శునకాన్ని పట్టుకుని.. దాని యజమానికి అప్పగించారు.

Read Also: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు ఆలయం మూత..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన పెంపుడు కుక్క తప్పిపోయిందంటూ.. శ్రీనివాస్ చార్యులు అనే రామాలయం పంతులు పోలీసులను ఆశ్రయించారు.. తన పెంపుడు కుక్క ల్యాబ్ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు ఎక్కడికో వెళ్లిపోయిందని.. తిరిగి ఇంటికి రాలేదని.. మూడు రోజుల పాటు మా కాలనీలో మొత్తం వెతికినా దాని ఆచూకీ దొరకలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలు చెక్‌ చేయడం మొదలుపెట్టారు.. చివరకు ఆ పెంపుడు కుక్కను అల్వన్ కాలనీలో గుర్తించారు.. దానిని తీసుకొచ్చి.. దాని యజమాని అయిన శ్రీనివాస్‌ చార్యులకు అప్పగించారు.. మొత్తంగా.. తప్పిపోయిన శునకాన్ని.. సీసీ కెమెరాలు ఇంటికి చేర్చాయి.. కాగా, సీసీ కెమెరాలు ఇప్పుడు వివిధ కేసుల్లో నేరగాలను కూడా పట్టుకోవడానికి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Show comments