NTV Telugu Site icon

సంచలనంగా మారిన రేవంత్‌ వ్యాఖ్యలు.. సర్కార్‌ను రద్దు చేస్తారా..?

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి.. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దుచేస్తారన్నారు రేవంత్‌ రెడ్డి. కేటీఆర్‌లా తనకు గాలివాటంలా ఉద్యోగం రాలేదని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. పొత్తులో కేటీఆర్ కి టికెట్ ఇచ్చినప్పుడు ఎంతకి కొన్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అన్నారు. అలాగే ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హరీష్‌రావు మంత్రి అయ్యారన్నారాయన. హరీష్‌రావు బతుకే కాంగ్రెస్‌ అని.. టీడీపీని విమర్శిస్తూనే ఎల్‌ రమణను టీఆర్‌ఎస్‌లోకి ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు రేవంత్‌. కాంగ్రెస్‌ మొదటి శత్రువని చెప్పిన కేసీఆర్‌… కుటుంబంతో వెళ్లి సోనియా కాళ్ల మీద పడలేదా అన్నారు. కేసీఆర్‌ టీఆరెస్‌కి ఎలా అధ్యక్షుడో కాంగ్రెస్‌కు తాను అధ్యక్షుడిని అన్నారు రేవంత్‌ రెడ్డి. అలాగే టీఆర్‌ఎస్‌లో 75 శాతం టీడీపీ నుంచి వచ్చినవాళ్లేనని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా టీడీపీనే టీఆర్‌ఎస్‌కు దిక్కయిందన్నారు. కేటీఆర్‌కు పౌరుషం ఉంటే… ఆంధ్ర నాయకుడి పేరు మార్చుకోవాలని సవాల్‌ విసిరారు. తాను బాబు మనిషి అయితే కేసీఆర్‌ కూడా చంద్రబాబు మనిషేనన్నారు. అలాగే కేటీఆర్, హరీష్‌ లను ఉద్దేశించి బావా బావమరుదులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిని అయినందుకు ప్రపంచానికే అధిపతి అయినట్టుగా సంతోషపడతానని మీకేంటి నొప్పంటూ ప్రశ్నించారు రేవంత్‌. దీంతో.. కొత్త చర్చ మొదలైంది.. గతంలో ముందస్తు ఎన్నికలు వెళ్లిన కేసీఆర్‌.. మరోసారి అదే పనిచేస్తారా? లేక వన్‌ నేషన్‌ వన్ ఎలక్షనే కారణం అవుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.