Site icon NTV Telugu

Patancheru : పాశమైలారం పేలుడు ఘటన.. 10కి చేరిన మృతుల సంఖ్య

Blast Patancheru

Blast Patancheru

Patancheru : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమ తునాతునకలైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఉదయం 9 గంటల సమయంలో సీగాచి కెమికల్స్‌లో పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కంపెనీ షెడ్డు పూర్తిగా కూలిపోయింది. మంటలు తక్కువ సమయంలోనే పరిశ్రమ మొత్తం వ్యాపించడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. అయినప్పటికీ, పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు.

HHVM : యానిమల్ చూసి బాబీ డియోల్ క్యారెక్టర్ మార్చేశా : దర్శకుడు జ్యోతికృష్ణ

ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు కార్మికులు మంటల్లో సజీవదహనమయ్యారు. మిగతా మృతుల మరణానికి తీవ్ర గాయాలు కారణమయ్యాయని తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా 15 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానించడంవల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. గాయపడ్డ 38 మందిలో 20 మందిని చందానగర్ ప్రభుత్వాస్పత్రికి, మరో 18 మందిని ఇస్నాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 8 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు భారీ క్రేన్‌లు, హైడ్రా మిషన్‌లను రంగంలోకి దించారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోవడంతో సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ప్రాణాపాయంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ భవనం నుంచి కేవలం ఆరుగురినే బయటకు తీయగలిగారు.

కెమికల్ ఫ్యాక్టరీలో మంటలతో పాటు భారీగా విషవాయువులు విడుదలవడంతో పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసనలు వ్యాపించాయి. స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతూ తమ ఇళ్లలోకి చెదురుమదురుగా చేరుకుంటున్నారు. అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి ఎవరూ రావొద్దని హెచ్చరించారు. ఈ పేలుడు ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్నదానిపై విచారణ కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు తర్వాత అసలు ప్రమాద స్థాయి ఎంత పెద్దదో అర్థం కానుంది.

Real Estate Fall In Hyderabad : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పతనానికి అసలు కారణాలు

Exit mobile version