పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 3న ట్రైలర్ ఆవిష్కరణ జరగనుంది.
Also Read : Star Wars : ఆ ఇద్దరి స్టార్స్ మధ్య మరోసారి నువ్వా నేనా.?
తాజాగా దర్శకుడు జ్యోతి కృష్ణ ‘ మీడియాతో ముచ్చటిస్తూ.. ‘పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇక ‘యానిమల్’ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్ ‘హరి హర వీరమల్లు’లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి బాబీ డియోల్ కు చెందిన కొన్ని సీన్స్ ను ‘యానిమల్’ రిలీజ్ కాక ముందే షూట్ చేశారు. కానీ యానిమల్ రిలీజ్ అయ్యాక బాబీ నటనను చూసిన తర్వాత బాబీ క్యారక్టర్ ను పునః రచించాలని నిర్ణయించుకుని ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా డిజైన్ చేసాము. “యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ గారి నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను” అని అన్నారు.