సంగారెడ్డి జిల్లా పటాంచెరు రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన నిర్ణయంపై బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం తాను చేసిన ఒక “తప్పటడుగు” అని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోకి మారడం వల్ల తన నియోజకవర్గానికి లేదా నియోజకవర్గ ప్రజలకు కనీసం “వెంట్రుక వాసి” కూడా ప్రయోజనం కలగలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల ఒత్తిడికి లోనై కాంగ్రెస్‌లో చేరానే తప్ప, దాని వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
తాను మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని మహిపాల్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తన అనుచరులకు, కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఉన్న 104 మంది కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాలు, వ్యాపార వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండి పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. కుల సంఘాల వారీగా, వర్గాల వారీగా విభాగాలు ఏర్పాటు చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు, ఆయన త్వరలోనే మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరుతారనే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ పరిణామం పటాంచెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు.
