తెలంగాణలో రెండు జిల్లాల ప్రజల చిరకాల వాంఛ వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. గోదావరి పై బ్రిడ్జ్ నిర్మిస్తే ఆ రెండు జిల్లాల వాసులకు ప్రయాణ దూర భారం తగ్గడమే కాకుండా సులభతరం అవుతుందని భావించిన వారందరికి నిరాశే ఎదురవుతుంది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం మట్టి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆనందాలు వెల్లివిరిసినా ఐదేళ్ళు అవుతున్నా వంతెన ఊసే లేదని స్థానికులు వాపోతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి- మంచిర్యాల జిల్లాల మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో రవాణా సౌకర్యంతో పాటు దూరభారం తగ్గనుందని సంబరపడిన ప్రజలకు నిరాశ తప్పడంలేదు. జిల్లాలోని మహదేవపూర్ మండలం పలుగుల వద్ద గోదావరిపైన 1.2 కిలోమీటర్ల పొడవుతో 40 పిల్లర్లతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ గ్రామ గోదావరి ఒడ్డు వరకు వంతెన నిర్మాణానికి 2017 ఏప్రిల్లో రెండు వారాల పాటు యంత్రాలతో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించారు. గోదావరిలో మొత్తం ఏడు చోట్ల మట్టి నమూనా పరీక్షలు చేపట్టారు.
హైదరాబాద్ కు చెందిన హెచ్ఐబీఎస్ సంస్థ ఆధ్వర్యంలో 40 మీటర్ల లోతు వరకు మట్టి పరీక్షించారు. కానీ ఇప్పటి వరకు వంతెన నిర్మాణంపై ఊసెత్తక పోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుంట్లం, ఎర్రాయి పేట మీదుగా కూడా నిర్మాణం చేపట్టడానికి అప్పటి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. కుంట్లం, ఎర్రాయిపేటల మధ్య గోదావరిలో నిర్మాణం జరిగితే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట ఒడ్డుపైనే జాతీయ రహదారి లింకు ఉంటుంది.సారపాక టు కౌటాల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మహదేవపూర్ మండలం నుంచి చెన్నూర్ గోదావరి వరకు వంతెన నిర్మాణం చేపట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ క్రమంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2017 ఫిబ్రవరి 5న పలుగుల వద్ద గోదావరి తీరాన్ని సందర్శించారు.
పలుగుల గోదావరిలో మట్టి నమూనా పరీక్షలు చేసి ఐదేండ్లు గడిచిన వంతెన నిర్మాణంపై ఎలాంటి పురోగతి లేక పోవడంతో ఈ ప్రాంత వాసులు నిరాశకు లోనవుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం చిరకాల వాంఛగా మిగిలిపోయింది. ప్రభుత్వం పలుగుల వద్ద వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి వేగం పెంచాలని స్థానికులు కోరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అన్నారం వద్ద వంతెన కమ్ బ్యారేజీ అందుబాటులో ఉంది. పలుగుల వద్ద వంతెన నిర్మాణం పూర్తయితే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు కుమ్రుంభీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు ప్రయాణం దూరం తగ్గనుంది.
అదే విధంగా పలుగుల ,మద్దులపల్లి వాసులు నిత్యావసరలకు,వైద్య ,వ్యాపార పరంగా పొరుగున ఉన్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ కు వెళ్తుంటారు. ప్రస్తుతం కాళేశ్వరం ,సీరోంచ మీదుగా చెన్నూర్ వెళ్లాలంటే 40 కి.మీ. దూరం వస్తుంది. కాగా బ్రిడ్జ్ నిర్మిస్తే 4 కిలో మీటర్లలో సులువుగా చెన్నూర్ కు చేరుకుంటామని స్థానికులు అంటున్నారు. ఈ వంతెన నిర్మాణంతో కొమురం భీం ,మంచిర్యాల , జయశంకర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యాలు పెరిగి, దూరభారం తగ్గనుంది. ఈ కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.
Hyderabad:ఇవాళ, రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు