Palla Rajeshwar Reddy Fires On Sajjala Ramakrishna Reddy Comments: ఏపీ, తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉండటమే తమ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి విషపు ఆలోచనతోనే మాట్లాడారని, ఆయన సాదాసీదాగా ఈ మాటలు అన్నట్లు తాము అనుకోవడం లేదని అన్నారు. నాడు మోడీతో కలిసి చంద్రబాబు తెలంగాణకు చెందిన ఏడు మండలాలను తీసుకున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రధానిగా మోడీ తెలంగాణకు సాయం చేయకపోగా.. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారంటూ అప్పట్లో దుర్మార్గంగా మాట్లాడారని విమర్శించారు. బెర్లీన్ గోడను బద్దలుకొట్టి జర్మనీ ఒక్కటి కాలేదని అని చంద్రబాబు మాట్లాడారని.. మోడీ దన్నుతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలతో కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా మోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
రెండు రాష్ట్రాలు ఒకటి చేస్తామని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారి మాటల వెనుక బీజేపీ, మోడీ ఉన్నారని తాము అనుకుంటున్నామని రాజేశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణపైకి మోడీ అనేక బాణాలు వదులుతున్నారని.. వైఎస్ షర్మిల, కేఏ పాల్‌తో పాటు మరికొందరికి బీజేపీ సపోర్ట్ ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వస్తే.. ఏదో అవుతుందని ఆరోజుల్లో కొందరు మాట్లాడారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే.. అది చీకట్లో ఉంటుందని, శాంతి భద్రతలతకు విఘాతం కలగడంతో పాటు మతకల్లోలాలు కూడా చోటు చేసుకుంటాయని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు అన్నారని గుర్తు చేసుకున్నారు. పంటలు పండించడం కూడా రాదన్నారని.. ఇప్పుడు అంతా తామే నేర్పిస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. 2014 నుంచి 2022 వరకు తెలంగాణ ప్రయాణం ఏ విధంగా జరిగిందో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
ఏపీలో 24 గంటలు కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉందని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ తెలంగాణ అన్నపూర్ణగా మారిందని.. ఆంధ్రప్రదేశ్ కాదని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు విభజన అసంబద్ధం అని చెప్పడం దుర్మార్గమన్నారు. ఏపీలో ఉన్న సమస్యల్ని ఎదుర్కోలేకే.. విభజన గురించి మాట్లాడుతున్నారని, ఇది దురదృష్టకరమని చెప్పారు. తెలంగాణకు విద్యుత్ సమస్యలు వున్నాయని తెలిసి కూడా.. మోడీ సీలేర్ పవర్ ప్రాజెక్ట్‌ను దొంగతనంగా లాక్కున్నారని దుయ్యబట్టారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణపై మోడీ విషం చిమ్ముతూనే ఉన్నారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.