Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!

  • జాతీయ ప్రాజెక్టు హోదాపై కేంద్రం కీలక ప్రకటన
  • డీపీఆర్ వెనక్కి.. సాంకేతిక పరిశీలనకు బ్రేక్
  • కృష్ణా జల వివాదమే ప్రధాన అడ్డంకి
  • కేంద్ర నిధులపై ఇంకా తుది నిర్ణయం లేదు
Palamuru

Palamuru

Palamuru Rangareddy Project: తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది.

డీపీఆర్ వెనక్కి.. సాంకేతిక అనుమతుల నిలిపివేత

కృష్ణా నదీ జలాల వినియోగం , అంతర్రాష్ట్ర వివాదాలు ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II (KWDT-II) పరిధిలో ఉన్నందున, ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో-ఎకనామిక్ అప్రైజల్‌ను ప్రస్తుతం చేపట్టలేమని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో తిరిగి రావాలంటూ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను కేంద్రం వెనక్కి పంపింది. అంతేకాకుండా, ప్రాజెక్టుకు కేంద్ర నిధుల సాయం అందించే విషయంలోనూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.

మార్గదర్శకాల ప్రకారమే హోదా కేటాయింపు

జాతీయ ప్రాజెక్టు హోదా అనేది ప్రధానంగా జాతీయ ప్రాధాన్యం, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల వివాదాలు లేకపోవడం , గణనీయమైన సాగునీటి సామర్థ్యం ఆధారంగా నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారమే ఇస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది. కృష్ణా జలాలపై క్లియరెన్సులు, ట్రిబ్యునల్ పరిధిలోని అంశాలు తేలితే తప్ప ఈ ప్రాజెక్టు హోదాపై తదుపరి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది.