కరోనా రక్కసి కొత్తకొత్త వేరియంట్‌లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి సబ్ వేరియంట్‌లు పుట్టుకోస్తున్నాయి. డెల్టావేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఒమిక్రాన్ వేరియంట్‌లకు ఉంది. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుండడంతో వెంటనే అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా, నైట్ లాక్‌డౌన్, వీకెండ్ లాక్‌డౌన్ ను విధించి థర్డ్‌వేవ్‌కు అడ్డుకట్టవేశాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి సబ్ వేరియంట్‌లు పుట్టకొస్తున్నాయి. చైనాలో కూడా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌తో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలోని శాంఘయ్ సిటీలో లాక్‌డౌన్ కూడా విధించారు.
అయితే ఇప్పుడు ఈ సబ్ వేరియంట్ బీఏ.2 కేసులు మన దేశంలో కూడా నమోదవడం మరోసారి భయాందోళనను సృష్టిస్తోంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌లోని బీఏ.2కు చెందిన ఎల్452ఆర్ మ్యుటేషన్ కేసులు భారత్‌లో 57 కేసులు నమోదైనట్లు సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు మరియు జన్యు శాస్త్రవేత్తలు తెలిపారు వెల్లడించారు. ఎల్452ఆర్ ఓమిక్రాన్ వేరియంట్‌ను తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్‌లో 11, కర్ణాటకలో 18 మందిలో గుర్తించారు. అయితే ఎల్452ఆర్ మ్యుటేషన్‌ను లక్ష్యంగా చేసుకునే నిర్దిష్ట చికిత్సా ప్రతిరోధకాలు మరియు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ మ్యుటేషన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశోధకులు అంటున్నారు.