Site icon NTV Telugu

Off The Record : అధిష్టానికి కంట్లో నలుసులా.. నిత్యా తలనొప్పిగా మారిన ప్రజా ప్రతినిధులు?

Telangana Politics

Telangana Politics

నలుగురు….. ఎస్‌, ఆ నలుగురు నాయకులు. ధిక్కార స్వరాలను ఓ రేంజ్‌లో వినిపిస్తున్నారు. ఆ సౌండ్‌తో వాళ్ళున్న పార్టీలకు సైతం గూబ గుయ్‌మంటోంది. తమ హాట్‌ హాట్‌ కామెంట్స్‌తో, చేతలతో తెలంగాణ సమాజం మొత్తాన్ని తమవైపు తిప్పుకుంటున్నారు. అధిష్టానాలకు కంట్లో నలుసులా, నిత్య తలనొప్పిగా మారిన ఆ ప్రజా ప్రతినిధులు ఎవరు? ఏంటి వాళ్ళ కథా, కమామీషు? సొంత పార్టీ అగ్రనేతల్నే టార్గెట్‌ చేస్తాడు. కేంద్ర మంత్రి అయినా…, రాష్ట్ర అధ్యక్షుడు అయినా.. ఆ నోటికి ఒక్కటే. మైండ్‌లో ఏదనిపిస్తే…బ్లైండ్‌గా అదే మాట్లాడేస్తాడు. మేటర్‌ ఏదైనాసరే… మనకు సీక్రెట్స్‌ ఉండవు. అంతా ఓపెన్‌ అంటూ…బహిరంగ వేదికల మీదే చర్చిస్తాడు. చివరకు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ వేయడానికి కూడా వెళ్ళి… అవకాశం దక్కక పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. అటు బీజేపీ కూడా…. కూడా ఇంతకాలం ఓపిగ్గా ఉండి ఉండి ఇదే అదనుగా, పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వెంటనే రిజైన్‌ లెటర్‌ మీద స్టాంప్‌ వేసేసి చేతులు దులుపుకుంది. క్రమశిక్షణకు కేరాఫ్‌ అని చెప్పే పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తే ఏం జరుగుతుందో చేతల్లో చూపించింది బీజేపీ హైకమాండ్‌. ఎమ్మెల్యేగా ఉంటూ సొంత పార్టీ నేతల్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన రాజాసింగ్‌ ఎపిసోడ్‌కి అలా ఎండ్‌ కార్ట్‌ వేసేసింది కాషాయ పార్టీ ఢిల్లీ నాయకత్వం. చాలా సార్లు సొంత పార్టీ నేతలపైనే సెటైర్లు వేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే ధిక్కారస్వరాన్ని భరించినంత కాలం భరించి చివరికి వదిలించుకున్నారు బీజేపీ పెద్దలు.

బీజేపీ రెబెల్‌ సంగతి అలా ఉంటే…ఇటు కాంగ్రెస్‌ పార్టీలో మరో ఎపిసోడ్‌ నడుస్తోంది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నేతగా మిగిలారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి. ఏకంగా సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలనే సోషల్‌ మీడియా వేదికగా తప్పు పట్టారాయన. కాదు.. కాదు… ఒకరకంగా కాదు ధిక్కార స్వరం వినిపించారు. 2034 వరకు తానే సీఎం అంటూ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని, ఇది కాంగ్రెస్‌ విధానం కాదని సోషల్‌ మీడియా వేదికగా తప్పుపట్టారు రాజగోపాల్‌రెడ్డి. తనకు మంత్రి పదవి రాలేదన్న అసహనంతో.. ఇలా సీఎం రేవంత్‌ రెడ్డిని క్వశ్చన్‌ చేసి ధిక్కార స్వరాన్ని వినిపించారన్నది కాంగ్రెస్‌ ఇంటర్నల్‌ టాక్‌. కానీ… ఇక్కడే పార్టీలో గతానికి భిన్నమైన వాతావరణం కనిపించింది. రాజగోపాల్ రెడ్డి స్వరం పెంచినా.. ధిక్కార సందేశం పెట్టినా… ఏ ఒక్క కాంగ్రెస్‌ నేతా స్పందించలేదు. ఆయన్ని సపోర్ట్‌ చేయలేదు. దాని గురించి కూడా చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు.

ఇక కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌లో ఉంటూనే ఏకంగా తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు పార్టీ విధానాలపై లేఖాస్త్రాన్ని సంధించారు. అక్కడితో ఆగకుండా కేసీఆర్ దేవుడేగానీ… ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని విమర్శించారామె. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకురావాలని డిసైడైన బీసీ రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ కరెక్ట్‌ కాదని, చట్టబద్దత కల్పించకుండా ఆర్డినెన్స్‌ అంటే… ఆయా కులాలను దగా చేయడమేనని అంటోంది బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం. కానీ… కవిత మాత్రం ఆర్డినెన్స్‌ను సమర్ధించారు. పార్టీలోనే ఉంటూ విధానాలను, పార్టీ స్టాండ్‌ను తప్పుపడుతూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు కవిత. అయినా సరే… ఆమె మీద చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోతున్నారు కేసీఆర్‌.

ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కూడా ఇదే బాటను ఎంచుకున్నారు. తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా లోపలి వాళ్ళే చేశారన్నది ఆయన అనుమానం. ఆ విషయంలో తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారట ఈటల. ఇటీవల తన ఇంటి దగ్గరకు వచ్చిన హుజూరాబాద్‌ నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపైనే పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు మల్కాజ్‌గిరి ఎంపీ. ఆయన ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని టార్గెట్‌ చేశారన్నది రాజకీయవర్గాల అభిప్రాయం.
ఈ నలుగురు సాదాసీదా నేతలు కాదు. రాజాసింగ్‌, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కవిత మాజీ ఎంపీ, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ. ఈటల సిట్టింగ్‌ ఎంపీ. వీళ్ళంతా…పార్టీల ద్వారా సంక్రమించిన పదవుల్లో ఉంటూనే… అవే పార్టీల మీదికి రాళ్ళేయడం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అవుతోంది. వీళ్ళని ఆయా పార్టీలు ఎలా డీల్‌ చేస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

Exit mobile version