NIA Arrests Four PFI Activists: శిక్షణ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని విషయం బట్టబయలు కావడంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వరుసగా పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తోంది. తాజాగా నిర్వహించిన దాడుల్లో నలుగురు కార్యకర్తల్ని అరెస్ట్ చేసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, షామీర్‌పేట్, కరీంనగర్ టౌన్‌లలో దాడులు నిర్వహించగా.. సమీర్, ఫిరోజ్ ఖాన్, మహమ్మద్ ఉస్మాన్, ఇర్ఫాన్‌లు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. రిమాండ్‌కు తరలించింది. నలుగురి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కస్టడీ రిపోర్ట్‌లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది.
శిక్షణ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పీఎఫ్ఐ కార్యకర్తలు పాల్పడుతున్నారని.. రెచ్చగొట్టే ప్రసంగాలు, మత ఘర్షణలకు తావిచ్చే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. ఉగ్రవాద ట్రైనింగ్‌ల కోసం ఇతర ప్రాంతాల నుంచి నిధులను సేకరిస్తోందని.. తెలంగాణతో పాటు ఆంధ్రాలో పలుచోట్ల దాడులకు కుట్న పన్నారని వెల్లడించింది. మూడు నెలల క్రితమే పీఎఫ్ఐ లీడర్ అబ్దుల్ ఖాదర్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే! ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయిన కార్యకర్తలు.. అబ్దుల్ ఖాదర్‌తో కలిసి ఉగ్రచర్యలకు కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. దేహదారుఢ్య పరీక్షల పేరుతో ఒక వర్గాన్ని టార్గెట్ చేసి.. కత్తులతో, ఐరన్ రాడ్‌లతో దాడి చేసేలా శిక్షణ ఇచ్చారని తెలిపింది. ఇందుకోసం పీఎఫ్ఐ క్యాడర్ పేరుతో కార్యకర్తలకు శిక్షణ ఇస్తోందని పేర్కొంది.
శిక్షణకు వచ్చే కార్యకర్తలను.. అబ్దుల్ ఖాదర్ & టీమ్ ఉగ్ర కుట్ర వైపు ట్రైన్ చేస్తున్నట్టు ఎన్ఐఏ చెప్పింది. ఉద్వేగపూరిత స్పీచ్‌లు, విడియోలు చూపిస్తూ ఒక వర్గంపై కక్ష పెరిగేలా నిర్వాహకులు ఉసిగొల్పుతున్నారని.. భారత ప్రభుత్వంపై, న్యాయ వ్యవస్థ కూడా కూడా కుట్రకు పథకం పన్నారని తెలిపింది. ప్రజల నుండి భారీ మొత్తంలో పీఎఫ్ఐ నిధులు సమకూర్చినట్టు స్పష్టం చేసింది. తమ విచారణలో తాము పాల్పడిన కుట్రల్ని అబ్దుల్ ఖాదర్ అంగీకరించినట్టు ఎన్ఐఏ తన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.