టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు మల్కాజగిరి డీసీసీ నందికంటి శ్రీధర్ కౌంటర్ ఇచ్చారు. ప్రజల సమస్యలకు సమాధానం చెప్పకుండా, మల్లారెడ్డి డ్రామాలాడారంటూ ఆరోపించారు. నీ చరిత్ర అందరికీ తెలిసిందేనని చెప్పిన ఆయన.. ‘జవహర్ నగర్‌లో కట్టిన ఆసుపత్రి నిర్మాణంలో తప్పు లేదా? కంటోన్మెంట్‌లో బీ1 ల్యాండ్‌లో కట్టిన ఫంక్షన్ హాల్ తప్పు కాదా?’ అంటూ నిలదీశారు.
జోకర్‌లాగా మాట్లాడి, మీ సిగ్గు మీరే తీసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘రేవంత్ రెడ్డిని అరేయ్, తురేయ్ అని సంబోధించి మాట్లాడావు.. నువ్వెలా తిరుగుతావో చూస్తాం’ అంటూ శ్రీధర్ హెచ్చరించారు. నీ కాలేజీలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లే రావడం లేదని విమర్శించిన ఆయన.. పాల వ్యాపారం ఎలా చేశావో, ఎవరి ఇంట్లో బంగారం కొట్టుకొని వచ్చి వ్యాపారం చేశావో చెప్పాలా? మాకు తెలియదా..? అంటూ శ్రీధర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇదిలావుండగా.. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.. అతనో బట్టేబాజ్, పెద్ద లుచ్చా అంటూ మల్లారెడ్డి తారాస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. రేవంత్ ఏ పార్టీలో ఉంటే, అది నాశనం అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. రేవంత్ తర్వాత బీజేపీ పార్టీలోకి చేరుతాడని చెప్పిన ఆయన.. మల్కాజ్‌గిరి సీటు కోసం తనని బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే, తన కాలేజీలు మూయిస్తారని రేవంత్ తనని బెదిరించాడని మండిపడ్డారు.