భారత ప్రభుత్వం సంవత్సరానికి రైతులకు ఆరువేల రూపాయలు ఇవ్వడానికి 100 షరతులు విధిస్తోందని, ఎలాంటి షరతులు లేకుండా కేసీఆర్ రైతులకు రైతు బంధు అమలు చేస్తున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు పథకంలో 92 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు ఉన్న వారేనని ఆయన వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో రైతులు ఆయిల్ ఇంజన్ తో వ్యవసాయం చేస్తున్నారని, ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్ లో ఉచిత విద్యుత్ లేదని ఆయన అన్నారు.
వ్యవసాయానికి దేశంలోనే ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖ చెప్పిన విధంగానే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. కష్టాన్ని నమ్మినవారు భూమి నమ్మిన వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కొద్దిపాటి ఆలోచనలతో ఓపికతో పని చేస్తే వ్యవసాయం అంత లాభసాటి పని ఇంకొకటి లేదని ఆయన వ్యాఖ్యానించారు.