ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మహితపురం జలపాతం వద్ద జరిగిన ఒక ఘటన స్థానికులను కలవరపెట్టింది. అనుమతి లేకుండా ఈ జలపాతానికి వెళ్లిన వరంగల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు అడవిలో దారి తప్పి చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు యువతులు, నలుగురు యవకులు ఉన్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వీరిని సురక్షితంగా కాపాడి, సమీపంలోని నుగూరు గ్రామానికి తరలించారు. మహితపురం జలపాతం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండటం వల్ల, ఇక్కడకు వెళ్లడానికి అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి.
Also Read:Dr Namratha: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత అరెస్ట్
అయితే, ఈ విషయం తెలియ లేదో లేక తెలిసినా లైట్ తీసుకున్నారో కానీ వరంగల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు దిగడం కోసం ఈ జలపాతానికి వెళ్లారు. జలపాతం వద్ద గడిపిన తర్వాత, తిరిగి వచ్చే క్రమంలో వారు అడవిలో దారి తప్పారు. సాయంత్రం సమయంలో గ్రామస్థుల నుంచి సమాచారం సేకరించి, వేరే అటవీ మార్గం ద్వారా తిరిగి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, అడవిలో చీకటి పడటంతో దారి కనిపించక, భయాందోళనకు గురై రాత్రి 9 గంటల సమయంలో డయల్ 100కు కాల్ చేసి సహాయం కోరారు.
Also Read:HHVM : హరిహర వీరమల్లు ఉచిత ప్రదర్శనలు..
విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదు అందుకున్న వెంటనే, గోపాలపురం పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు పంపిన లొకేషన్ ఆధారంగా, అటవీ శాఖ అధికారుల సహాయంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు. దట్టమైన అడవిలో, భారీ వర్షాల మధ్య కూడా, అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఏడుగురు విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. రెస్క్యూ చేసిన తర్వాత, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, వారి భయాందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు అధికారులు. అనంతరం, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి, వారిని సురక్షితంగా ఇంటికి పంపించారు.