ఎంబీసీ కులాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను కాంగ్రెస్ హయాంలో కేవలం ఎస్సిలకే పరిమితం చేసిందన్నారు. అంతేకాకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను బీసీలకు కూడా కల్పించిందన్నారు. తెలంగాణలో బీసీ రుణాలు ఆటకెక్కాయి ఆయన ఆరోపించారు.
ఎంబీసీలను కేసీఆర్ చులకనగా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంబీసీల రాజకీయ ఏకీకరణ కోసం నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని, తెలంగాణలో నిధులు లేక కార్పొరేషన్లు మూగబోయాయని ఆయన వ్యాఖ్యానించారు. యూపీలో 22మంది బీసీలను మంత్రివర్గంలోకి తీసుకున్నారని, రాష్ట్రంలో 54శాతం ఉన్న ఓబీసీలకు కేవలం మూడే మంత్రి పదవులు కేసీఆర్ ఇచ్చారన్నారు. ఇదే కేసీఆర్ సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు.
ఎంబీసీ వర్గాలకు బీజేపీ అండగా ఉంది.. రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ఫెడరేషన్లు వేసి నిధులు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్రంలో బొంగరం తిప్పుతానంటున్నారని, భారత్ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెడతానంటున్నారని, కేసీఆర్ రాచారిక,కుటుంబ పాలనను ఎంబీసీలు తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.