MP Dharmapuri Arvind Fires On CM KCR In BJP Munugodu Meeting: తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఒక న్యూక్లియర్ బాంబ్‌లా తయారయ్యారని మునుగోడు సమరభేరీలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. ఆయన దేశంలోనే అందరి కంటే పెద్ద అబద్ధాలకోరు అని, కేసీఆర్ పాలనను అంతమొందించి రామరాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తాడని భావించి కేసీఆర్‌కు ప్రజలు అధికారమిస్తే.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. తమ పాలనలో భూముల రేట్లు పెరిగాయని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించామని చెప్తున్న కేసీఆర్.. భూనిర్వాసితులకు ఎందుకు పరిహారం చెల్లించడం లేదని ప్రశ్నించారు. శివలింగంపై తేలులా, గర్భగుడిలో గబ్బిలంలా కేసీఆర్ మారారని ఆరోపణలు చేశఆరు. మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రోడ్డు రోలర్‌లా తొక్కాలని, ఉప ఎన్నికలో పాపాల భైరవుడు కేసీఆర్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజల్ని కోరారు.
ఇదే సమయంలో బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని చూస్తే కేసీఆర్‌కి నిద్ర పట్టడం లేదన్నారు. మునుగోడులో ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ది పనులు చేపడుతోందని అన్నారు. ముంపు గ్రామాల్లోని వారికి పరిహారం, రోడ్లు వేయడం, పెన్షన్‌లు ఇవ్వడం లాంటివి చేస్తున్నారన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవడం తప్ప, తెలంగాణలో ఏమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం కుంభకోణంలో డబ్బులు గుమ్మరించి.. ఖజానా మొత్తం ఖాళీ చేశారన్నారు. రైతుల బావుల దగ్గర మీటర్లు పెడతారంటూ.. విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శివన్నగూడెంలో రైతులను ముంచి, వారి భూములను గుంజుకుని ఆర్ఆర్ ప్యాకేజీకి కింద నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.