Montha Cyclone : మొంథా తుఫాన్ ప్రభావం పెరుగుతోంది. ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ భద్రాద్రి జిల్లాకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. తుఫాన్ ప్రభావంతో ఈ రెండు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా మున్నేరు నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే మున్నేరులో నీటి మట్టం 14 అడుగులకు చేరింది. నీటి మట్టం 16 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తక్కువ ఎత్తున్న ప్రాంతాల ప్రజలను ముందస్తు చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రహదారులపై నీరు నిలవడం, చెట్లు కూలిపోవడం వంటి సమస్యలు నమోదవుతున్నాయి. విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయాలు ఎదురవుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే గంటల్లో ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.