MLC Kavitha Counters On BJP: అధికారంలో ఉన్నంత మాత్రాన టీఆర్ఎస్ ప్రజలకు దూరమయ్యే పార్టీ కాదని.. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కొంతమంది ప్రజలను విడగొట్టి, రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, మతం పేరు చెప్పి ఆగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు. జై శ్రీరామ్ అని బిజెపి అంటే.. మనమంతా జై జై శ్రీరామ్ అందామని పిలుపునిచ్చారు. అయినా.. అసలు విషయం అది కాదని, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడిగారు. ఉద్యోగాల నోటిఫిషన్లు కోసం ఎంపి అరవింద్‌ను నిలదీయాలన్నారు. ధాన్యం కొనుగోలుకు లిమిట్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని, అది గ్రహించిన సీఎం కేసీఆర్ ఎత్తేశారని అన్నారు. ఎన్నికల కోసం బీజేపీ రాముడిని వాడుకుంటోందని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఆ పార్టీ ‘జై శ్రీరాం’ అంటోందని కవిత ఎద్దేవా చేశారు. ఇక బతుకమ్మ సంబరాల్ని ఈ తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుందామని చెప్పారు.
అంతకుముందు.. బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. జెన్నారం జెడ్పీటీసీ ఎర్రశేఖర్ బృందం రూపొందించిన ‘సిరిమల్లెలో రామ రఘుమల్లెలో’ అనే గీతాన్ని.. రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అలాగే శుక్రవారం ఉదయం తెలంగాణ జాగృతి-యూకే విభాగం ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను సైతం కవిత ఆవిష్కరించారు. అక్టోబర్ 2న యూకేలోని ఇల్‌ఫోర్డ్ నగరంలో బతుకమ్మ సంబరాల్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా.. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు చేనేత చీరలు అందించాలని నిర్ణయించిన తెలంగాణ జాగృతి – యూకే విభాగాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, జాగృతి ఉపాధ్యక్షుడు, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి యుకే అధ్యక్షుడు బల్మూరి సుమన్ రావ్, సాయి కృష్ణారెడ్డి, పత్తి రెడ్డి, ప్రశాంత్ పూస, శ్రావణి బాల్మూరి, మానసా రెడ్డి, సాగరికా పూస, రోహిత్ రావు పాల్గొన్నారు.