బీజేపీ ముగ్గురు శాసనసభ్యులను పూర్తి సెషన్ సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టడంతో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం బహిర్గతమైందని, బీజేపీ నైతికంగా విజయం సాధించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను పూర్తి సెషన్ కోసం సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిందని, బీజేపీ ఎమ్మెల్యేలను పూర్తి సెషన్ సస్పెండ్ చేయడం వారి ప్రాథమిక హక్కులను హరించినట్లయిందని పేర్కొన్నందున టీఆర్ఎస్ పార్టీ ఇకముందు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని అన్నారు.
ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నదని, బీజేపీ సభ్యుల హక్కుల కాలరాసిందనడానికి కోర్టు సూచించిన విధానాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రశ్నించేవారూ ఉండాలని, కానీ.. టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ పట్ల ప్రజాధరణ పెరుగుతుండటంతో సహించలేక అకారణంగా బీజేపీ సభ్యులను సస్పెండ్ చేసిందని విమర్శించారు. సభా హక్కులను ఉల్లంఘిస్తున్న టీఆర్ఎస్ కు రోజులు దగ్గరపడ్డాయని గ్రహించాలన్నారు.