MLA Jeevan Reddy Says No To Gujarat Model In Telangana: పేద ప్రజలని వంచించే గుజరాత్ మోడల్ మనకు వద్దని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే తెలంగాణ మోడల్ ముద్దు అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఈ దేశంలోనే లేరని పేర్కొన్నారు. మహిళలకు కేసీఆర్ పెద్ద పీట వేశారని, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రతీ కుటుంబానికి పెన్షన్లు అందుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చెబితే రామాయణం.. వింటే భారతమని చెప్పారు. ఉచితాలంటూ పేద ప్రజలపై కక్ష గట్టిన మోదీ ప్రభుత్వానికి.. ముసలివారికి అన్నం పెడితే బాధ ఎందుకని ప్రశ్నించారు. పేదోళ్లకు బీజేపీ వ్యతిరేకమని, టీఆర్ఎస్ బీదల పార్టీ అని జీవన్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అంతేకాదు.. కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా.. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే! తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని.. ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి కలిగించడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నుంచి కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని జోస్యం చెప్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు తమదైన శైలిలో బీజేపీకి కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ కుటుంబం జోలికొస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే.. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. ఆ బాటలోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేదవారికి పెన్షన్లు పంపిణీ చేస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న మంచి పనుల గురించి వివరిస్తున్నారు. బీజేపీ మాటలకు లొంగొద్దని, ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నారు.