NTV Telugu Site icon

KTR: మోదీజీ.. దేశాన్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు

Minister Ktr Comments On Pm Modi

Minister Ktr Comments On Pm Modi

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో అగ్రనేతలు భాగ్యనగరానికి రానున్న సంగతి తెలిసిందే. బీజేపీ అగ్రనేతల హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే బీజేపీ, తెరాసల మధ్య ఫ్లెక్లీవార్ నడుస్తూనే ఉంది. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తూ కాషాయ నేతలు, మోదీ బైబై అంటూ తెరాస పార్టీ నేతలు ఫ్లెక్సీలతో భాగ్యనగరంలో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో కమళం పార్టీ నేతలను మించినవారు లేరని ఎద్దేవా చేశారు.

అవకాశం దొరికిన ప్రతిసారి బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు చేసే మంత్రి కేటీఆర్ మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని ఎన్నిసార్లు మోసం చేస్తారని ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 2018, ఏప్రిల్‌లో ఓ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించామని అన్నారు. మరోవైపు ఎన్‌పీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామానికి జూన్‌ 25న కరెంట్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పించిన వార్తా కథనాన్ని జోడిస్తూ ట్విట్టర్​లో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎన్నిసార్లు దేశప్రజలను మోసం చేస్తారు మోదీజీ అంటూ కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.