Srinivas Gude: పదో తరగతి పేపర్ లీకేజీ కుట్రలో ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ అంశంలో బీజేపీ నేతల ప్రమేయంపై ఆయన మండిపడ్డారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ పథకాలను చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని అన్నారు. తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ నాయకులు పేపర్ లీక్ చేసి విద్యార్థులను ప్రజలను భయాందోళనలకు గురి చేయడం దుర్మార్గమన్నారు. హిందీ పేపర్ లీక్ చేసిన బీజేపీ నాయకుడు వెంటనే ఆ పార్టీ అధ్యక్షునికి పేపర్ ను పంపించడం, ఆయన వెంటనే మీడియాకు సమాచారం అందించడం కుట్రలో భాగమే అని మండిపడ్డారు. పేపర్ ను వెంటనే వందల వాట్సప్ గ్రూపులకు షేర్ చేసి విద్యార్థులను భయాందోళనలకు ఎందుకు గురి చేశారు? అని ప్రశ్నించారు. పేపర్ బయటికి వచ్చిందని తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి సమాచారం ఎందుకు వెళ్ళింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపంచారు. బీజేపీ నాయకులు చానళ్లకు బ్రేకింగ్ పెట్టమని సమాచారం ఇచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా పేపర్ లీక్ అయి ఉంటే పోలీసులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలి కానీ బీజేపీ నాయకుడు ఆ పార్టీ అధ్యక్షునికి పంపించి ఆయన పేపర్ లీక్ అయిందంటూ మీడియా వాళ్లకు సమాచారం అందించి రాద్ధాంతం చేశారంటే దాని వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోవాలని అన్నారు.
Read also: Infertility: ప్రతీ ఆరుగురిలో ఒకరికి సంతానలేమి.. డబ్ల్యూహెచ్ఓ నివేదికలో వెల్లడి..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ చేసిన నిందితుడు కూడా బిజెపి కార్యకర్తనే. ఇప్పుడు పదో తరగతి పేపర్ లీక్ పేరిట బీజేపీ నాయకులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు బీజేపీనాయకులు చేస్తున్న కుట్రకు ఇది నిదర్శనం అని ప్రజలు గమనించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ చేయడం సర్వసాధారణం కాబట్టి ఆ కుట్రలను తెలంగాణలో అమలు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పేపర్ లీకేజీ కుట్రలో ఉన్న ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైనది ఇలాంటి కుట్రదారులను వెంటనే అరెస్టు చేసి, మరోసారి ఇలాంటి ఆలోచన చేయాలంటేనే భయపడేలా చేస్తామని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రం ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజ్ ద్వారా తెలంగాణకు అప్రతిష్ట తెచ్చేందుకు చేస్తున్న కుట్రలను ఆపాలని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని హితువు పలికారు.
Heat Stroke : వడదెబ్బ తగలొద్దంటే ఆహారంలో ఇవి ఉండాల్సిందే..