Minister Seethakka : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రి సీతక్క ప్రచారం చేశారు. శుక్రవారం బోరబండలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ… నవీన్ యాదవ్ విజయం జూబ్లీహిల్స్ అభివృద్ధికి కొత్త మలుపు అవుతుందని సీతక్క అన్నారు. మూడు పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, ఇప్పటికీ ప్రజలు నీటి సమస్యలు, డ్రైనేజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. “ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను స్వయంగా చూస్తున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి,” అని చెప్పారు.
అంతేకాకుండా.. మీరు నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇస్తే, అభివృద్ధి, సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, చవక గ్యాస్ సిలిండర్లు అందిస్తోందని, ఒక్క జూబ్లీహిల్స్లోనే రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు నవీన్ యాదవ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కానీ ఒకప్పుడు కేసీఆర్ పార్టీకి శ్రీశైలం యాదవ్ కుటుంబం ఆర్థిక సహాయం చేసింది. ఆ కుటుంబాన్ని ఇప్పుడు విమర్శించడం ప్రజలు సహించరని అన్నారు.
బీఆర్ఎస్లో రౌడీ షీటర్లు చేరారని, బాలికలను వేధించిన వారిని కేటీఆర్ దండం పెట్టి చేర్చుకుంటున్నారన్నారు. సొంత ఆడబిడ్డ కవితనూ వేధించిన కేటీఆర్, ఇతర ఆడబిడ్డలను ఎలా రక్షిస్తారు? అని ప్రశ్నించారు. ఈ గల్లీలో పుట్టి పెరిగిన నవీన్ యాదవ్‌ను గెలిపించండని, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి, కన్నీళ్లు కావాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి అని పిలుపునిచ్చారు.
Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!