Minister Prashant Reddy criticizes Nirmala Sitharaman’s comments: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఆమెపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. హరీష్ రావు ఛాలెంజ్ కి భయపడే నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుందని ఎద్దేవా చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మాల సీతారామన్ హయాంలో రూపాయి విలువ విపరీతంగా పడిపోతుందని అన్నారు. కేసీఆర్ ను చూసి బీజేపీ వణికిపోతోందని అన్నారు. కేసీఆర్ రాష్ట్రం దాటి బయటకు వస్తే వైఫల్యాలు బయటపడతాయని కేంద్రానికి భయం పట్టుకుందని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అందుకే కేంద్ర మంత్రులు తెలంగాణకు గడికి ఒకరు వస్తున్నారని అన్నారు.
Read Also: Pocharam Srinivas Reddy: నిర్మలా సీతారామన్ నాకు అక్కతో సమానం..
నిర్మలా సీతారామన్ మాట్లాడినవన్నీ అబద్ధాలే అని.. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీలో కేంద్రానిది ఒక్క రూపాయి కూడా లేదని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన గుజరాత్ లోనే అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ రోజు నిర్మలా సీతారామన్ బెదిరింపు ధోరణితో మాట్లాడిందని అన్నారు. రేషన్ షాపుల్లో నరేంద్ర మోదీ ఫోటో లేదని గొడవ పెట్టుకున్నారని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాలకు తెలంగాణ సొమ్ము వాడారు..కాబట్టి కేసీఆర్ ఫోటో పెట్టగలరా..? అని ప్రశ్నించారు. ఆహార భద్రత చట్టం కింద కేంద్రం రాష్ట్రాలకు బియ్యం ఇవ్వడం ప్రజల హక్కని తెలిపారు. రూ.3.65 లక్షల కోట్లు పన్నులు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత చెల్లించామని..కేంద్రం నుంచి రూ.1.6 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని అన్నారు.
బీహార్, యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు కనీసం లక్ష కోట్లు మా డబ్బు వినియోగించారని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో కేంద్రం ఒత్తడి చేస్తేనే చేరామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీని గురించి నిర్మలా సీతారామన్ కు అవగాహన లేదని విమర్శించారు. అంతకు ముందు మంత్రి హరీష్ రావు 2021లోనే తెలంగాణ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిందని.. అలా చేరకపోతే నేను రాజీనామా చేస్తానని.. లేకపోతే మీరు రాజీనామా చేస్తారా..? అని నిర్మలా సీతారామన్ కు సవాల్ విసిరారు.