పల్లె నిద్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని రంగాపూర్ గ్రామంలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు పరిశీలించిన ఆయన.. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని.. ప్రతి ఊరికి మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నామని చెప్పారు. దశలవారీగా అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందన్నారు.
రంగాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలకు రూ. 2.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పిన ఆయన.. రాష్ట్రంలో పాఠశాల మౌలిక సదుపాయాల కోసం 9 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. మొదటి దశలో రూ.3,497.62 కోట్లు కేటాయించామని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆర్థిక వ్యవస్థలో ఎదుగుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభంలో ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా.. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.