Mallareddy: కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సినిమా చూపిస్తా అని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్డు వరకు సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. మల్కాజిగిరి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో పండుగ వాతావరణం.. దసరా పండగ వాతావరణం నెలకొందని తెలిపారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందని, ఇక్కడ లక్ష ఓట్ల మెజార్టీ రావాలని ప్రజలను కోరారు. సినిమా చూపించారు.. ఇది ట్రైలర్ మాత్రమే.. రాబోయే రోజుల్లో మంచి సినిమా చూపిస్తామని మల్లారెడ్డి అన్నారు. బీఆర్ ఎస్ అంటే రామ రాజ్యం… రాముడు వచ్చాడు.. రాజేశేకరుడు వచ్చాడని అన్నారు.
రావణాసురుడుని కాల్చి వదిలి పెడతాం.. దసరా రోజు ఆ రావణాసురుడిని కాల్చుడే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కనకారెడ్డి వచ్చినంకే మల్కాజిగిరికి మంచినీళ్లు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే రౌడీలు, గుండగాళ్ళు, స్కాములన్నారు. మల్కాజిగిరి ఎంపీకి ఇక్కడకు రావడానికి ముఖం లేదని తెలిపారు. డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కుని వచ్చాడని తెలిపారు. నోటుకు ఓటు చేసింది మన ఎంపినే అని తెలిపారు. ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, కేసీఆర్ అండగా ఉన్నారని తెలిపారు. క్రమ శిక్షణ తప్పితే బిఆర్ఎస్ నుంచి డిస్మిస్ చేస్తామన్నారు. రాముడు లాంటి వాడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నో బాధలు పడ్డాం… ఇప్పుడు బాధలు పడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సినిమా చూపిస్తా అని తెలిపారు. నడుచుకుంటూ వచ్చిన అక్కల కాళ్ళు మొక్కుతా.. మీ పగ తీర్చుకోండి… బీఆర్ఎస్ కు ఓట్లు గుద్ది గుద్ది వదలాలన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మొద్దు.. కేసీఆర్ ఆసరా పెన్షన్లు పెంచుతా అని చెప్పారని మల్లారెడ్డి తెలిపారు.
Read also: Telangana: గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. జిల్లా ఆసుపత్రుల్లోనే క్యాన్సర్‌కు చికిత్స..
ఇక మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక పరిస్థితుల్లో మల్కాజిగిరి ఉందని తెలిపారు. క్యాడర్ అయోమయంలో ఉందన్నారు. కార్యకర్తలకు భరోసా ఇస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి మల్కాజిగిరికి ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారన్నారు. కార్యకర్తలు అయోమయంకు గురి కావద్దని తెలిపారు. మహేంద్ర హిల్స్ లో రియర్వాయర్ కట్టాలన్నారు. చెరువుల వల్ల కాలనీలు ముంపునకు గురౌతున్నాయని తెలిపారు. డ్రైనేజీ పనులు కూడా చేయాల్సి ఉందని తెలిపారు. మల్కాజిగిరి ఎంపీగా స్వల్ప తేడాతో ఒడిపోయా అన్నారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి… సమస్యలు పరిష్కరిస్తా అన్నారు. దుండిగల్ లో ఓ ఆసుపత్రి ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. కేసీఆర్ శ్రీరామరక్ష.. ఆయన ఉన్నన్ని రోజులు ఎవరికి ఏమి కాదని తెలిపారు.
Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి బరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి..! ఖరారు చేసిన కేసీఆర్..