చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్.
ఇప్పటికే టెక్స్ టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండు ఏళ్లు గా కరోనా సంక్షోభం కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని.. ఇలాంటి నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పన్ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడం ఆ పరిశ్రమను చావు దెబ్బ కొడుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని కల్పించే టెక్స్ టైల్ మరియు చేనేత రంగానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి.. ఆదుకోవాల్సిన సందర్భంలో.. ఇలాంటి నిర్ణయం సరైందని కాదని అభిప్రాయపడ్డారు.